మంచి ఆహారం.. సరైన వ్యాయామాలతో ఆరోగ్యం భద్రం
ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు డాక్టర్ లెరోయ్ హుడ్
ఈనాడు, హైదరాబాద్: మంచి ఆహారం(Healthy Food).. సరైన వ్యాయామంతో వందేళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమేనని అమెరికాకు చెందిన ప్రఖ్యాత బయాలజిస్టు, సియాటిల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ(ఐఎస్‌బీ) అధ్యక్షులు, సహ వ్యవస్థాపకులు డాక్టర్ లెరోయ్ హుడ్ అన్నారు. రోజువారీ ఆహారంలో ఎక్కువ పీచు(ఫైబర్), తక్కువ కొవ్వు (ఫ్యాట్) ఉండే పదార్థాలు తీసుకోవాలని సూచించారు. భోజనానికి.. భోజనానికీ మధ్య ఎక్కువ విరామం ఉండాలన్నారు. రాత్రి ఎక్కువ భోజనం తింటే.. మరుసటిరోజు ఉదయం అల్పాహారం తీసుకోకుండా టీ లేదా కాఫీతో సరిపెట్టవచ్చని చెప్పారు. మళ్లీ మధ్యాహ్నం తక్కువ తిని.. రాత్రి ఎక్కువ భోజనం చేయాలన్నారు.
ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బాదం, పిస్తా, వాల్‌నట్స్ ఎక్కువగా తినాలని సూచించారు. తాను ఇదే విధానం పాటిస్తూ.. బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన వాస్తవ వయసు 82 ఏళ్లు అయినా.. బయోలాజికల్ వయసు 65 సంవత్సరాలేనని తెలిపారు. భారతరత్నకు సమానమైన అమెరికాకు చెందిన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డును డాక్టర్ లెరోయ్ పొందారు. ఆయన మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో బయో బ్యాంకు ప్రారంభించిన సందర్భంగా ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
బయో బ్యాంకులతో ఉపయోగాలు..
బయో బ్యాంకుల ద్వారా సేకరించిన డీఎన్‌ఏ సమాచారంతో రానున్న రోజుల్లో వైద్యసేవల రూపురేఖలే మారిపోనున్నాయి. మానవ కణజాల నమూనాలను సేకరించి.. విశ్లేషించి.. తద్వారా డీఎన్‌ఏలో మార్పులను అంచనా వేయవచ్చు. అంటే పదేళ్లకు ముందు ఆరోగ్యవంతుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఆ తర్వాత క్యాన్సర్, లేదా మధుమేహం సోకితే అతని పాత, ప్రస్తుత నమూనాలను పరిశీలించి.. జన్యువుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవచ్చు. ఈ సమాచారంతో రానున్న తరంలో ముందే ఇలాంటి వ్యాధుల ముప్పును పసిగట్టవచ్చు.
ఏ వ్యాధుల్లో జీన్ ఎడిటింగ్ సాధ్యం..
సింగిల్ జీన్‌లో సమస్యతో వచ్చే సికిల్‌సెల్ ఎనీమియా, థలసీమియా లాంటి వ్యాధులను జీన్ ఎడిటింగ్‌తో నివారించవచ్చు. ఈ పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా నైతికపరమైన ఆందోళన ఉన్నమాట నిజం. వచ్చే పదేళ్లలో జీన్ ఎడిటింగ్ చికిత్సల్లో పురోగతి కనిపిస్తుంది. పలు వ్యాధులకు పరిష్కారం లభిస్తుంది. ఇందులో బయో బ్యాంకుల పాత్ర కీలకం కానుంది.
మెదడు ఆరోగ్యంపై మీ పరిశోధనలు..
వాస్తవానికి 30 ఏళ్ల వయసు నుంచే ప్రతి ఒక్కరిలో మెదడు పనితీరు నెమ్మదిస్తుందని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం 25 రకాల ఎక్సర్‌సైజ్‌లకు రూపకల్పన చేస్తున్నాం. ముఖ్యంగా మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందిస్తే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకు పులప్స్, ఇతర ఏరోబిక్ వ్యాయామాలు అలవాటు చేసుకోవాలి.
మధుమేహం నియంత్రణకు సూచనలు..
దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ప్రయత్నించాలంటే.. వాటి గురించి వీలైనంత ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండాలి. ఆయా వ్యాధులకు సంబంధించి వివిధ దశల్లో ఉన్న రోగులను పరిశీలించాలి. ప్రస్తుత ప్రయత్నం అలాంటిదే. ఏఐజీలో చేపడుతున్న ఫినోమ్ ప్రాజెక్టులో భాగంగా గణనీయమైన డేటా అందుబాటులోకి వస్తుంది. ఆ సమాచారాన్ని పరిశోధించడం ద్వారా మధుమేహాన్ని నివారించేందుకు కొత్త పద్ధతుల గురించి ఆలోచించి, ఆవిష్కరించగలుగుతాం.